లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుండి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా తణుకు పట్టణం సొసైటీ రోడ్డు లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడుతూ ఆహార పదార్థాలు ఎలా ఉంటున్నాయి.. మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు…ఈ పథకం ఉపయోగంగా ఉందా అని ఆరా తీశారు. ఈ సందర్భంలో కొందరు మాట్లాడుతూ మాలాంటి పేదవారికి అతి తక్కువ ధరతో అల్పాహారం, భోజనం అందించడం ద్వారా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అలాగే గతంలో సంపాదించిన భాగంలో ఎక్కువ భాగం తినడానికే ఖర్చు అయిపోయేదని, ఇప్పుడు రోజు మొత్తంలో 15 రూపాయలు ఖర్చు చేస్తే తినడానికి సరిపోతుంది అని, మాకు డబ్బు కూడా బాగా ఆదా అవుతుంది అని తెలిపారు. ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయని, వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం పట్టణానికి వస్తూ ఉంటామని అన్న కాంటీన్ ద్వారా మా ఆకలి తీరుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు తెలిపారు. క్యాంటీన్ నిర్వాహకులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యాంటీన్ లోపల, బయట పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంట పాత్రలు శుభ్రంగా క్లీన్ చేయించాలని, లేనిపక్షంలో ఆహారం కలుషితమై అనారోగ్యానికి దారితీస్తుందన్నారు. చేతులు కడుగుకునే ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, ఈగలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ తనిఖీ సందర్భంలో తణుకు తాహసిల్దార్ డి వి ఎస్ ఎస్ అశోక్ వర్మ, మున్సిపల్ ఇంజనీర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, తదితరులు ఉన్నారు.