లీడర్ డిజిటల్ న్యూస్ (విజయవాడ )ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని,అందరికీ అన్నంపెట్టే అన్నదాతలకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. 1854 నుంచి 1952 వరకు దాదాపు 100 సంవత్సరాల పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు బ్యారేజీ సేవలందించిందని.. 1952 లో వచ్చిన వరదలకు బ్యారేజీ దెబ్బతినడంతో ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరును పెట్టడం జరిగిందన్నారు. ఆపై 1957 నుంచి దాదాపు 13.8 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా అందుతున్నాయి. ఈ బ్యారేజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు వరప్రదాయనిగా నిర్విరామంగా సేవలందిస్తోంది. ఆ విధంగా పాత ఆనకట్ట వంద సంవత్సరాలు, కొత్త ఆనకట్టకు దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే దాదాపు 170 సంవత్సరాల ఘన చరిత్ర ప్రకాశం బ్యారేజీ కి ఉంది. 11,42,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన కీలక పరిస్థితిలో ఐదు పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ సాగిస్తున్నాయన్నారు. మొత్తం పడవల్లో ఒక పడవ గేట్ల మధ్య నుంచి కిందకు వెళ్లిపోగా మూడు పడవలను గుర్తించడం జరిగింది. మరో పడవ ఆచూకీ తెలుసుకుంటున్నాం. గుర్తించిన మూడు పడవలకు యజమాని ఒకరే కావడం అనుమానానికి దారితీస్తోంది. ఈ పడవల యజమాని అయిన ఉషాద్రి.. కోమటి రామ్మోహన్ కు అనుచరుడిగా ఉన్నారు. ఈ రామ్మోహన్ తలశిల రఘురాంతో బంధుత్వం ఉండటం అనుమానాలకు తావిస్తోంది.గత ప్రభుత్వ అండదండలతో నందిగం సురేష్ వీరంతా సిండికేట్ గా ఏర్పడి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అక్రమంగా లూటీ చేశారు. పడవలకు వైఎస్ఆర్ సీపీ రంగులు కూడా ఉండడం.. ఈ బోట్లు అధికారిక పార్టీకి సంబంధించినవి అని చెప్పేలా రంగులు వేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇలా దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు వస్తోంది. కాకుండా ప్రకాశం బ్యారేజీ భద్రత పరంగా ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు.
అన్నదాతలకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు – మంత్రి నిమ్మల రామానాయుడు
09
Sep