ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  కాకినాడ జిల్లా కలెక్టర్ తో బుధవారం ఉదయం ఫోన్ ద్వారా వరద పరిస్థితిపై చర్చించారు.ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం – రాపర్తి, పెద్దాపురం – గుడివాడ, సామర్లకోట – పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయని వివరించారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు.పవన్ కళ్యాణ్  దిశానిర్దేశం చేస్తూ ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. దళాలతోపాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని స్పష్టం చేశారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

#2024APFloodsRelief
#AndhraPradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *