భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బి.ఆర్.గవాయ్ పై దాడి దేశ రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై దాడి…నిందితుడు రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి…

లీడర్ న్యూస్ (భీమవరం) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పై జరిగిన బూటు దాడి గర్హనీయమని, ఇది రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడని, మతోన్మాదాన్ని తలకెక్కించుకుని దాడికి పాల్పపడిన న్యాయవాది రాకేష్ కిషోర్ ని, అతన్ని పురికొల్పిన మతోన్మాద శక్తులను చట్టబద్ధంగా శిక్షించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. జస్టీస్ బి.ఆర్.గవాయ్ పై సుప్రీం కోర్టులో మతోన్మాది చేసిన దాడిని నిరసిస్తూ సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసిపిఐయు, ప్రజా సంఘాలు మంగళవారం భీమవరం పాత బస్ స్టాండ్ రోడ్ లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద నల్ల బాడ్జీలు ధరించి, ఆందోళన,నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ చెప్పులతో, బూట్లుతో నిమ్న వర్గాలను అవమానించడం సనాతన ధర్మంలో నిత్యకృత్యంగా మారిందని, దళితుడయిన సిజెఐ పై బూటు విసిరి మరోసారి సనాతన వాదులు మొత్తం దళితులను అవమానించారని నిప్పులు చెరిగారు. సిజెఐ పై దాడిని ప్రపంచమంతా ఖండించి రోడ్లపైకి వచ్చిందని, ఇప్పటికీ దీనిపై మోడీ స్పందించలేదని సాదాసీదాగా ఒక ట్వీట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నాడని కోనాల విమర్శించారు. గత పదకొండేళ్ల విద్వేష పాలనకు పరాకాష్ట గా సిజెపై దాడి జరిగిందని, ఇటువంటి దుశ్చర్యలపై కఠిన చర్యలు తీసుకోకపోతే మతోన్మాదులు హత్యలకు కూడా పాల్పడతారని కోనాల విమర్శించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్ మాట్లాడుతూ సిజెఐ పై జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిందని, పాలకులు ప్రేరణతోనే ఇది జరిగిందని ద్వజమెత్తారు.
హేతువాదులు, కవులు, రచయితలు, మేధావులు, అభ్యుదయ, ప్రగతిశీల వాదులపై గత పదకొండేళ్లుగా దమనకాండ జరుగుతుందని గోపాలన్ గుర్తు చేశారు. మతోన్మాద పాలకుల భరోసాతోనే దాడి జరిగిందని, ఈ ఘటనను సిజెఐ హుందాగా క్షమించినా దేశ ప్రజలు క్షమించరని ప్రగతిశీల, అభ్యుదయ వాదులపై భవిష్యత్తులో దాడులు జరక్కుండా నిందితుడు రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని గోపాలన్ డిమాండ్ చేశారు.ఎంసిపిఐయు జిల్లా నాయకులు కె.మహంకాళి, ఫార్వార్డ్ బ్లాక్ డివిజన్ కార్యదర్శి దండు శ్రీనివాసరాజు మాట్లాడుతూ సిజెపై నిస్సిగ్గుగా దాడి జరగడం శోచనీయమని అతనికి అంత ధైర్యం ఎలా వచ్చిందని, దీని వెనుక ఎవరున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పుల్ స్టాప్ పెట్టకపోతే మతోన్మాదులు మరిన్ని హత్యలకు పాల్పడతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాను రానూ వేర్పాటువాద, మతోన్మాద శక్తులతో దేశానికి ప్రమాదం ఏర్పడిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, వై.వి.ఆనంద్, నాయకులు నాగిడి శాంతమూర్తి, ఛాన్ భాషా, సిపిఎం నాయకులు బి.వాసుదేవరావు, ఎం.వైకుంఠరావు, డి.త్రిమూర్తులు, ఎం.ఆంజనేయులు, ఏక్షన్ ఫర్ పీపుల్స్ ప్రోగ్రెస్ రాష్ట్ర కన్వీనర్ ఎన్.కనకరాజు, పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *