గత ప్రభుత్వ హయాంలో అత్తిలి ఏఎంసీ నిర్లక్ష్యం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (తణుకు) గత వైసిపి ప్రభుత్వ హయాంలో అత్తిలి మార్కెట్ కమిటీ పరిధిలోని పుంత రోడ్లను నిర్లక్ష్యం చేసి ఎఎంసి అభివృద్ధికి విఘాతం కలిగించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం శనివారం చైర్మన్ దాసం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదోవ పట్టించారని ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు అత్తిలి మార్కెట్ కమిటీ పరిధిలో పుంత రోడ్లు అభివృద్ధికి దాదాపు రూ. 55 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అత్తిలి గ్రామానికి చెందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు కనీసం ఏఎంసి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రూ. వేల కోట్లు అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకున్న అప్పటి నాయకులు ఎక్కడ ఎంత మేర అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను మోసం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో మార్కెట్ కమిటీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మార్కెట్ కమిటీల ఆదాయాలు పెంచే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అత్తిలి ఏఎంసీ పరిధిలోని పుంత రోడ్లు అభివృద్ధి కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అత్తిలి మార్కెట్ కమిటీ పరిధిలో రూ. 14 కోట్లు నిల్వ ఉంటే వాటిని అప్పటి నాయకులు పక్కదో పట్టించారని విమర్శించారు. 7.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్తిలి మార్కెట్ యార్డ్ సద్వినియోగం చేసుకొని తద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షులు కడలి రామాంజనేయులు, ఇతర పాలకవర్గం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *