లీడర్ న్యూస్ (తణుకు )ఈనెల 31న దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘం ఎఐటియుసి 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు.గురువారం తణుకు శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వద్ద జరిగిన స్పిన్నింగ్ మిల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో భీమారావు మాట్లాడుతూ ఏఐటీయూసీ పతాకాలను ఆవిష్కరించి 105 ఏళ్ళ ఏఐటీయూసీ ఉద్యమ పోరాట చరిత్ర వివరించాలన్నారు.1920 అక్టోబరు 31న లాలాలజపతిరాయ్ అధ్యక్షుడుగా ముంబై నగరంలో దేశంలోనే తొలి కేంద్ర కార్మిక సంఘంగా ఎఐటియుసి ఆవిర్భావం జరిగిందన్నారు. లోకమాన్య బాలగంగాధరతిలక్,చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రు లాంటి యోధానుయోధులెందరో ఏఐటీయూసీ ఆవిర్భావంలో కీలకపాత్ర నిర్వహించి కార్మిక హక్కులు సాధనకు ఉద్యమించారన్నారు.
1926 భారత కార్మిక చట్టం సాధించడం ద్వారా కార్మికులు యూనియన్ పెట్టుకునే చట్టబద్ధమైన హక్కు,1948 కనీస వేతనాల చట్టం,8 గంటల పని,1947లో పారిశ్రామిక వివాదాల చట్టం,సమ్మె హక్కు చట్టం లాంటి ఎన్నో ముఖ్యమైన కార్మిక చట్టాలు ఎఐటియుసి నిర్విరామ పోరాటాల ఫలితంగానే సాధించు కోవడం జరిగిందన్నారు.ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 36 కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వం కార్పొరేట్ లకు అనుకూలంగా రద్దు చేసి కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తూ 4 లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. అలాగే 8 గంటల పనికి తిలోదకాలిస్తూ 12 గంటల పని తెస్తుందన్నారు.ఏఐటీయూసీ ఉద్యమ పోరాటాల స్ఫూర్తితో కార్మిక హక్కులు,చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలన్నారు.
స్పిన్నింగ్ మిల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి దాకే ముసలయ్య, గరగ శ్రీనివాస్,నెక్కంటి యదుకృష్ణ, కడలి వెంకటేశ్ రరావు,సుంకవల్లి శ్రీరామారావు, మన్నే రమేష్, సుంకవల్లి సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.