లీడర్ న్యూస్ (తణుకు) స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయని, పత్రికలు సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాలని ప్రముఖ జర్నలిస్టు బెల్లంకొండ బుచ్చిబాబు అన్నారు.గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో బెల్లంకొండ బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని “సామాజిక అభివృద్ధిలో మీడియా పాత్ర” అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.భారత దేశంలో మొదటి పత్రిక 1780 వ సంవత్సరంలో ఆంగ్లంలో ప్రచురించిన “బెంగాల్ గెజిట్” అనీ, తెలుగులో మొదటి పత్రిక 1902 లో ప్రచురించిన “కృష్ణా పత్రిక” అనీ ఆయన వివరించారు. ఆనాడు పత్రికలు స్వాతంత్ర్య సమరంలో దేశభక్తులకు, ప్రజలకు స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చాయని బుచ్చిబాబు పేర్కొన్నారు. పత్రికలు సమాజ శ్రేయస్సుకోసం నిబద్ధతతో కూడిన సత్యమైన వార్తలు ప్రచురించాలని కోరారు.ముందుగా సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. సభకు మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.ఈ సభలో మరో ముఖ్య అతిధి, స్థానిక ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కలగ నాగ వెంకట రామ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చెయ్యాలనీ, సెల్ ఫోన్ కు దూరంగా ఉండి, విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలు సమగ్రంగా చదువుకోవాలని హితవు పలికారు. అదే విధంగా విద్యార్థులు గ్రంథాలయం సందర్శించి దిన, వార, మాస పత్రికలు, రిఫరెన్స్ పుస్తకాలు అధ్యయనం చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హితవు పలికారు.సభలో చివరిగా బెల్లంకొండ బుచ్చిబాబు, కలగ నాగ వెంకట రామ్ కుమార్ లను దుశ్శాలువాలతో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కౌరు వెంకటేశ్వర్లు, కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు ప్రభృతులు ఘనంగా సత్కరించారు.