లీడర్ న్యూస్ (నిడదవోలు) తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దీక్షబూని ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు గారి పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలచుకొనేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకానికి ‘అమరజీవి జలధార’ అని నామకరణం చేశారు. ప్రతి మనిషి జీవితంలో ఉరుకుల పరుగులన్నీ అన్నపానీయాల గురించే ఉంటాయి. నేను… నా కుటుంబం… వారికి మూడు పూటలా పట్టెడన్నం, స్వచ్ఛమైన నీరు అందించాలనే తపన ప్రతి మనిషికి ఉంటుంది. ఉండాలి. కానీ… నేను, నా కుటుంబం అనే దగ్గరే ఆగిపోకుండా… సమాజం, నా ప్రజలు, నా రాష్ట్రం, నా భాష అని గళమెత్తి, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు పేరును ప్రతి ఒక్కరూ తలచుకొనేలా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అన్నపానీయాలు మాని, 56 రోజుల పాటు మండుతున్న కడుపు, ఎండిపోయిన డొక్కకు బంకమట్టి రాసుకుని పోరాడిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు.. అలాంటి మహా మనిషి త్యాగానికి నివాళిగా అమరజీవి జలధార అని ఖరారు చేశారు.
అమరజీవి జలధార పోస్టర్ విడుదల
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పనులకు శనివారం ఉదయం నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ‘అమరజీవి జలధార’ పోస్టర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
ప్రాజెక్ట్ వివరాలు
– రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు ప్రాజెక్టులు చేపడుతున్నారు..
– ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి..
– మొత్తం ప్రాజెక్టు విలువ : రూ. 7,910 కోట్లు..
– వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చడం లక్ష్యం..
– ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించిన పనులకు మార్కాపురంలో శంకుస్థాపన చేశారు..
– 23 నియోజకవర్గాల పరిధిలో 68 లక్షల మంది దాహర్తి తీర్చనుంది..
– రెండు ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 3,050 కోట్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా : రూ. 1400 కోట్లు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా : రూ.1,650 కోట్లు