లీడర్ న్యూస్ (తణుకు) సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్బంగా ఈనెల 18 న ఖమ్మం లో జరుగుతున్న ప్రజాప్రదర్శన, బహిరంగ సభలకు సీపీఐ, ప్రజాసంఘాల శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు.ఈనెల 18 న ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి వేడుకలు విజయవంతం కోరుతూ శనివారం సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనలో తెల్ల దొరలను దేశం నుంచి తరిమికొట్టడంలో అసమానతలు,దోపిడి లేని సమసమాజ నిర్మాణానికి ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని భీమారావు అన్నారు.1925 డిశంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించిన సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్బంగా దేశవ్యాపితంగా విచ్చేసే లక్షలాదిమంది శ్రమ జీవులు, కష్ట జీవులతో ఈనెల 18 న ఖమ్మం లో ప్రజాప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈసభలో దేశ, విదేశాలనుంచి కమ్యూనిస్ట్, సోషలిస్టు యోధులు, సెక్యూలర్ పార్టీల నాయకులు పాల్గొంటున్నారన్నారు.శ్రమజీవులు, కార్మికులు,కర్షకుల హక్కుల సాధనకు వందేళ్ళగా సీపీఐ విరామమెరుగని పోరాటాలు సాగిస్తుందన్నారు. దున్నేవానికే భూమి నినాదంతో చేసిన సుదీర్ఘ పోరాటంతో భూ సంస్కరణల చట్టం సాధించి లక్షలాది ఎకరాల భూములకు పేదలకు పంపిణీ చేయించడం జరిగిందన్నారు. బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు సీపీఐ పోరాట ఫలితమేన్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన దున్నేవానికే భూమి, జమిందారీ వ్యతిరేక పోరాటాల్లో దేవరకొండ సుబ్బారావు, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, ప్రేరేప మృత్యుంజయుడు, కలిదిండి సూర్యనారాయణ రాజు, గండ్రేటి నరశింహారావు, బొరుసు మంగన్న లాంటి 19 మంది కమ్యూనిస్ట్ యోధులను పోలీసులు కాల్చి చంపారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కారానికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన చరిత్ర దేశంలో ఒక్క సీపీఐ కు మాత్రమే వుందన్నారు.
వెనిజులాపై దాడి అమానుషం
వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మధురో దంపతులను నిర్భందంలోకి తీసుకోవడం అమానుషమని భీమారావు అన్నారు.అమెరికన్ సామ్రాజ్య వాదానికి, ట్రంప్ అధికారదాహానికి ఈచర్య పరాకాష్ట అన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను బేఖాతరు చేస్తూ ట్రంప్ చేస్తున్న దురాగతాలను అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించాలన్నారు.
భారత్ పై అధిక సుంకాలు విధించి బెదిరింపులకు పాల్పడడం అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని,కుటిల బద్ధిని తేటతెల్లం చేస్తుందన్నారు.
సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సీపీఐ తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్ప కుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు పరిష్కారానికి నిరంతరం పోరాడే పార్టీ సీపీఐ అన్నారు. మతసామరస్యం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఉద్యమిస్తుందన్నారు. ఈనెల 18 న ఖమ్మంలో జరుగతున్న సీపీఐ శతాబ్ధి వేడుకలకు తణుకు పట్టణం, ఏరియాల నుంచి అధికసంఖ్యలో తరలివెళుతున్నామన్నారు.
సీపీఐ నాయకులు నామాన వెంకటేశ్వరరావు, బొద్దాని కృష్ణ కిషోర్,గుబ్బల వెంకటేశ్వరరావు,పుట్టా అమ్మిరాజు,బండి సత్యనారాయణ బొద్దాని మురళీ,నక్కా బాలయ్య, సబ్బితి బ్రహ్మయ్య,రాజశేఖర్ పతి ఏఐటీయూసీ నాయకులు మందుల ముత్తయ్య, కొంబత్తుల రవికుమార్,దేవ పెద్దిరాజు,చిక్కాల దుర్గా ప్రసాద్, ఇసుకపల్లి రమేష్, ఎ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.