లీడర్ న్యూస్ (తణుకు) సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే నేషనల్ సైన్స్ డే సందర్భంగా తణుకు సి.ఎం కన్వెన్షన్ హాల్‌లో విహాన్ కాలేజ్, రూట్స్ మేనేజ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వి.వి. లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి జీవితంలో మొదటి ముఖ్య ఘట్టమని, మార్చి 16 నుంచి జరగబోయే పరీక్షలకు విద్యార్థులు పండుగలా సిద్ధం కావాలని సూచించారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పరీక్షలను కూడా పండుగలా భావించి ఉత్సాహంగా ఎదుర్కోవాలన్నారు.ఏదైనా సాధించాలంటే కొన్ని అలవాట్లను వదలాల్సిందేనని, ముఖ్యంగా ఫోన్లు, సోషల్ మీడియా కార్యకలాపాలను పక్కన పెట్టి ఎక్కువ సమయం చదువుపై కేంద్రీకరించాలన్నారు. చదువుతున్న కళాశాలకు పేరు తీసుకొచ్చే విధంగా తయారవ్వాలని ప్రేరణనిచ్చారు. పదో తరగతి తర్వాత ఏ దిశగా వెళ్లాలనే సందిగ్ధత సహజమని, ముందుగా తాను ఏ సబ్జెక్టులో బలంగా ఉన్నానో తెలుసుకోవాలి, తరువాత క్లాస్ టీచర్‌ను అడగాలి, చివరగా అనుభవజ్ఞులను సంప్రదించాలని మూడు దశల మార్గదర్శకాన్ని సూచించారు.రాష్ట్రంలో సుమారు 16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నప్పటికీ 15 లక్షల మంది మాత్రమే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. జెఈఈ మెయిన్, జెఈఈ అడ్వాన్స్డ్, పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలంటే శత్రువు శక్తిని అంచనా వేసి యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుడిలా ప్రిపేర్ కావాలని అన్నారు. విహాన్ కాలేజ్ ఐఐటీ, జెఈఈ మెయిన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.బయాలజీపై ఆసక్తి ఉన్నవారు బైపీసీ వైపు వెళ్లాలని, నీట్ పరీక్ష పోటీ తీవ్రతను అర్థం చేసుకుని సిద్ధం కావాలని సూచించారు. సుమారు 1.15 లక్షల సీట్లకు 25 లక్షల మంది దరఖాస్తు చేస్తారని, ఎంబిబిఎస్ సీట్లలో పోటీ తీవ్రంగా ఉంటుందని వివరించారు. బైపీసీ చేసిన వారికి వెటర్నరీ, ఆయుర్వేదం, నేచురోపతి, నర్సింగ్, కెమికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.రెండు సంవత్సరాలు యజ్ఞంలా కష్టపడితేనే భవిష్యత్తు బాగుంటుందని, టాపర్స్ ఇంటర్వ్యూలు చూడాలని సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ చేయడం ద్వారా మెరుగైన భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు.స్నేహితుల ప్రభావం ఎంత ముఖ్యమో వివరించేందుకు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లె ల ఉదాహరణలను ప్రస్తావించారు. ఇద్దరూ ఒకే గురువుతో శిక్షణ పొందినా లక్ష్యసాధనలో తేడా కారణంగా జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు.“లక్ష్యం స్పష్టంగా ఉండాలి. హార్డ్ వర్క్‌తో కాకుండా ఇష్టంతో చదవాలి. ఎవరు ఏ రంగంలోనైనా సాధించాలంటే కనీసం 10 వేల గంటలు కష్టపడాలి” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. సివిల్ సర్వీసెస్‌లోకి రావాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రూట్స్ డైరెక్టర్స్ విద్యాకాంత్, సుధాకర్ వర్మ, త్రిపాఠీ, విహాన్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్స్ లక్ష్మణరావు,వంశీకృష్ణ తదితరులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా కెరీర్ గైడెన్స్ సదస్సు…
01
Mar