లీడర్ న్యూస్ (మంగళగిరి)విశాఖ గో మాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విశాఖ పోలీసులకు సూచించారు. గో మాంసం నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని తెలిపారు. విశాఖలో భారీగా గో మాంసం నిల్వలు పట్టుబడిన వ్యవహారంపై ఆరా తీశారు. విశాఖ పోలీస్ కమిషర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసం ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు? ఎక్కడి నుంచి తెచ్చారు.. నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు?అనే అంశాలపై పవన్ విచారించారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్.ఐ) అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని పట్టుకుని, కేసును పోలీస్ శాఖకు అప్పగించినట్టు కమిషనర్ పవన్ కళ్యాణ్ కి తెలిపారు. డి.ఆర్.ఐ అధికారులు దాడులు జరిపిన సందర్భంలో అక్కడ ఉన్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమ రవాణా నెట్ వర్క్ ఎంత మేర విస్తరించి ఉంది? అనుమతుల ఉల్లంఘనలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్టు కమిషనర్ తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.