లీడర్ న్యూస్ (తణుకు) తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కీళ్లు, వెన్నుపూస వ్యాధులకు సంబంధించి ఓపీ విభాగాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014–19 మధ్య కాలంలో లయన్స్ సహకారంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిధి పెంచేందుకు మరో అయిదు డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి తీసకురానున్నట్లు చెప్పారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం సరాసరి 600 వరకు ఓపీ వస్తున్నారని చెప్పారు. ఇందుకోసం కంటి సంబంధిత వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తణుకు పట్టణంలోని ప్రముఖ ప్రైవేటు వైద్యులతో ఎంవోయూ చేసుకుని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. గతంలో యాపిల్ ఆసుపత్రి సౌజన్యంతో కిడ్నీ సంబంధిత ఓపీ ప్రారంభించుకున్నామన్నారు. నిమ్మగడ్డ ఆసుపత్రి సహకారంతో డాక్టర్లు అచ్యుత రామయ్య, ప్రదీప్, నిహారికలు న్యూరో, కీళ్లు, వెన్నుపూస వ్యాధులకు సంబంధించి ఓపీ ప్రారంభించామన్నారు. డాక్టర్ సాయికిరణ్ ప్రతి బుధ, శుక్రవారం అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, టిడిపి తణుకు పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, ఇతర వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కీళ్లు, వెన్నుపూస వ్యాధుల ఓపీ ప్రారంభం… ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందిస్తాం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
20
Nov