లీడర్ న్యూస్ (తణుకు) అయిదేళ్ల వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో భాగంగా రెండో విడత రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్బంగా బుధవారం తణుకు కమ్మ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. అయిదేళ్లలో రైతులను బూతులు తిడుతూ వారి పట్ల అవహేళనగా మాట్లాడుతూ స్థానికంగా మంత్రిగా పని చేసిన కారుమూరి వెంకటనాగేశ్వరరావు వ్యవహరించారని ఆరోపించారు.
గతంలో తుపాను కారణంగా తణుకు నియోజకవర్గంలో పంట నష్టం ఏర్పడితే 3434 మంది రైతులకు రూ. 3.14 కోట్లు ఇన్పుట్ సబ్సిడి కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా 3,783 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేసి అందుకు సంబంధించి 3857 మంది రైతులకు 3.84 కోట్లు ప్రభుత్వానికి అంచనాలు పంపిచినట్లు గుర్తు చేశారు. కాలువల్లో తూడు తొలగించడానికి ఇటీవల వేసవి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్లు మేర ఖర్చు చేశామన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తణుకు నియోజకవర్గంలో 16,954 మంది రైతులకు మొదటి విడతలో ఆగస్టు 2025లో రూ. 11.66 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయగా అక్టోబరులో 16 వేల మంది రైతులకు రూ. 11.51 కోట్లు మేర రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా ఉంటోందన్నారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు రైతులు ధాన్యంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.