లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) తన కుటుంబం కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆశ పడింది. కోటి ఆశలతో మస్కట్ కి ఉపాధి కోసం వెళ్లి…. కేవలం ఏడాదిన్నర కాలంలోనే తాను అనుకున్న ఆశ నెరవేరదని అర్ధం చేసుకొని స్వగ్రామానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో విధి చిన్న చూపు చూసింది. కళ్ళ ముందు ఆశ నెరవేరలేదనే బాధ… మరో వైపు చేసిన అప్పులు ఎలా తీర్చగలం అనే ఆవేదనతో ఆ మహిళ కృంగి కృషించిపోతూ, మరో వైపు తన కుటుంబాన్ని చూస్తున్నాను అనే ఆనందానికి మధ్య నలిగిపోయింది ఆ మహిళ…. హైదరాబాద్ లో విమానం దిగిన వెంటనే బస్సు ఎక్కిన ఆ మహిళ బస్సులోనే తిరిగి రాని అనంత లోకాలకు వెళ్లిపోయింది…
వివరాల్లోకి వెళితే…
అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన బొంతా ప్రభాకర్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు. భార్య బొంతా సత్య పద్మ జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్ళడానికి విజయవాడకి చెందిన మహిళా ఏజెంట్ ని సంప్రదించి 2లక్షల పైచిలుకు కట్టి విమానం ఎక్కింది. హార్ట్ కి సంబందించిన సమస్యలు ఉండటంతో మస్కట్ లో ఆమె ఆరోగ్యం రోజు, రోజుకి క్షీణించింది. తిరిగి సొంత గ్రామానికి వెళ్ళిపోతానని ఏజెంట్ ని కోరగా… మరో 2,50,000/- కడితే ఊరికి పంపించడం జరుగుతుందని చెప్పి, సత్యపద్మ పనిచేస్తున్న దగ్గర నుండి మస్కట్ లో ఉన్న విజయవాడ ఏజెంట్ చెల్లెలు ఉన్న కార్యాలయానికి తీసుకువెళ్లడం జరిగింది. సత్యపద్మ భర్త డబ్బులు వేసిన తర్వాత సత్యపద్మని విమానం ఎక్కించారు. విమానం ఎక్కిన సమాచారం కుటుంబ సభ్యులకు ఏజెంట్ సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్ నుండి ఇంటికి చేరే క్రమంలో సత్యపద్మ కి తీవ్రమైన గుండె పోటు రావడంతో విజయవాడలో సమీపంలో బస్సులోనే మృతి చెందింది.ఆమె మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరు అవుతున్నారు.