లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు రూరల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మూర్తి హెచ్చరించారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం, తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీ సభ్యులతోపాటు మహిళలు, హిజ్రాలు మొత్తం 17 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
ఉత్సవాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పుడే నిర్వహణ, మైక్, లైటింగ్, మున్సిపల్, ఫైర్, విద్యుత్ శాఖల నుంచి అనుమతులు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు . దరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్వహకుల వివరాలు సేకరిస్తున్నామని,తాడేపల్లిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో అక్కడక్కడా అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.సంబంధిత నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.నృత్యాలకు సహకరించే వాహనాల యజమానులు, డ్రైవర్లను, మైక్, లైటింగ్ వేసిన వారిని బాధ్యులు చేస్తామన్నారు. నిమజ్జనం సమయంలో సైతం ఎలాంటి అశ్లీల నృత్యాలు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో తణుకు రూరల్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, రూరల్ ఎస్సై ఏజీఎస్ మూర్తి పాల్గొన్నారు.