బడుగ బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన పోరాట యోధుడు వంక సత్యం – కొనాల భీమారావు

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)కమ్యూనిస్టుపార్టీ పై నిషేధం ఉన్న రోజుల్లోనే పార్టీ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించి, బడుగ బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన పోరాట యోధుడు, బడుగుల వాణిని చట్ట సభలో వినిపించిన అసెంబ్లీ టైగర్ వంక సత్యనారాయణ ఆశయ సాధనకు పునరంకితం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమర యోధులు, సీపీఐ ఉద్యమనేత, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ వంక సత్యనారాయణ 6వ వర్ధంతి సభ శుక్రవారం తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు జరిగింది.సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షత వహించారు.సభలో ముప్పాళ్ళ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తాను విద్యార్ధి, యువజన నాయకునిగా ఉన్న సమయంలో వంక తమకు మార్గదర్శకులని గుర్తు చేశారు. నాడు కమ్యూనిస్టు ఉద్యమాలు, త్యాగాలు ప్రజల్లోకి చొచ్చుకు పోయి మేధావులు, అణగారిన వర్గాలు కమ్యూనిస్టుల పిలుపు కోసం చూసేవారని నేడు ప్రజల్లో స్ధబ్ధత, శూన్యత ఏర్పడిందని వంక సత్యం వంటి నాయకుల స్పూర్తితో ప్రజాస్వామ్య మనుగడకు మరో పోరాటం చేయాలని ముప్పాళ్ల పేర్కొన్నారు. నాడు ఇందిరా ఎమర్జెన్సీని ప్రకటించి హక్కులను హరిస్తే నేడు మోడీ అప్రకటిత ఎమర్జెన్సీతో ప్రమాదం ఏర్పడిందని ముప్పాళ్ల నిప్పులు చెరిగారు. సిపిఐ, సిపిఎం, లౌకిక పార్టీల శ్రమ ఫలితం, ప్రజల్లో చైతన్యం మూలంగానే బిజెపి మేజిక్ ఫిగర్ దాటకుండా నిలువరించామని ముప్పాళ్ల గుర్తు చేశారు. మీడియా విలువలు కోల్పోయి అధికార పక్షానికి దాసోహం అంటున్న వేళ పేదల పక్షాన లౌకికవాద మీడియా బలమయిన గొంతు వినిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్య వాదులు చేస్తున్న పోరాటం స్పుర్తిదాయకమన్నారు. ప్రజలకు గత్యంతరం లేక ఏదో ఒక పార్టీకి ఓటేస్తున్నారని

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రజా సమస్యలే పరిష్కారంగా కమ్యూనిస్టు ఉద్యమాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లినప్పుడు 2029 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకమవుతుందని వంక సత్యనారాయణ పోరాట స్పూర్తితో ఆ దిశగా ముందుకెళ్ళాలన్నారు.

 

విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్.వి. రామారావు ప్రస్తుత రాజకీయాలు -పత్రికా విలువలు అనే అంశంపై స్మారకోపన్యాసం చేసారు. ఆర్వీఆర్ మాట్లాడుతూ విలువలు పత్రికలకేనా రాజకీయ పార్టీలకు అవసరంలేదా అని ప్రశ్నించారు. ఆర్ధికాంశాల సారాంశంమే రాజకీయాలని, నాటి మీడియా స్వాతంత్ర్య లక్ష్యాల కోసం పరితపిస్తే నేటి మీడియా రాజకీయ లక్ష్యం కోసం పని చేస్తున్నాయని ఆర్.వి.ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛ ఎమర్జెన్సీ కాలంలోనే కనిపించిందని, నేడు పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని ఆర్.వి.ఆర్. పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ మిక్సెడ్ ఎకానమి పేరుతో ఒక కాషాయాన్ని రూపొందించారని దాన్ని రూపాంతరం చెందించి పెట్టుబడిదారీ విధానంలోకి తీసుకురావడానికి పటేల్, పురుషోత్తం టాండన్ వంటి బిజెపి ఛాయలున్న నాయకులు పునాదులు నిర్మించి మోడీకి మార్గం చూపారని ఆర్.వి.ఆర్ విమర్శించారు. నేటి విధ్వంసానికి డిజిన్విస్టుమెంటు పేరుతో అటల్ బిహారీ వాజపేయి హయంలోనే బీజం పడిందని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టులకు చుట్ట సభల్లో సీట్లు అలలు వంటివని వారికి ప్రజల్లో పునాదులే ముఖ్యమన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తన అద్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ వంక సత్యనారాయణ జిల్లాను పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా రంగాల్లో ముందుకు నడిపించారని, పేదలకు భూ పంపిణీలో, జిల్లాకు రెండో పంట తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేశారని ఖాయిలా పడ్డ పరిశ్రమలను ఆయన తెరిపించారని ప్రశంసించారు. మూడు దఫాలు ఎమ్మెల్యే గా పని చేసి, బడుగుల వాణిని అసెంబ్లీలో వినిపించి ఎన్నిటికో పరిష్కారం చూపారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను, వంకాను విడదీసి చూడలేమన్నారు. దారిదీపం సంపాదకులు డీవీవీయస్ వర్మ మాట్లాడుతూ డబ్బు, లబ్ధి ఇవి రెండే రాజకీయాలను నడిపిస్తున్నాయని, తాయిలాలకు తలొగ్గకుండా ఓటేసినప్పుడే సమాజం పురోభివృద్ధి సాదిస్తుందని, సంపద పునః పంపిణీ జరగాలని ఆ దిశగా ప్రజలు పనిచేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ నాటి కమ్యూనిస్టు ఉద్యమంలో వంక సత్యం ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. ఉద్దరాజు రామం, ఎస్.ఆర్.దాట్ల, అల్లూరి సత్యనారాయణరాజు, ఆర్.ఎస్, సంకు అప్పారావు, ఇందుకూరి సుబ్బరాజు వంటి నాయకులతో వంక పనిచేశారని వంక గొప్ప పోరాట యోధుడని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ వంకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, నేటి సమకాలీన అంశాలపై చర్చ జరగాలన్నారు. తమ తండ్రి నేర్పిన వాటినే నేడు పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వేరే పార్టీలో ఉన్నా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్నామని, నేటి సంస్మరణ సభను నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, జిల్లా సమితి, పట్టణ సమితికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వంక రామదాసు, డాక్టర్ వంక వసుంధర,వంక రాజకుమారి,డాక్టర్ బి.రమేష్ చంద్రబాబు, అరుణ రేఖ, బి.సీతామహాలక్ష్మి,సంకు మనోరమ, ప్రముఖ కవి వి.ఎస్.వి.ప్రసాద్ తదితరులు మాట్లాడారు. అనంతరం అతిథులకు వంక సత్యనారాయణ కుటుంబ సభ్యులు జ్ఞాపికలను ప్రధానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సికిలే పుష్పకుమారి,ఎం.సీతారాం ప్రసాద్, కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *