లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)సోలార్ విద్యుత్ కొనుగోలులో అదానీ అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (సిపిసి)చే విచారణ జరిపించాలని, మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో చర్చించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాపిత పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ అశోక్ వర్మకు అందజేశారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కొనుగోలులో అదానీ అవినీతి చర్యలపై అమెరికా న్యాయ స్థానము అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో అదానీపై చర్యలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టను మంట గడుపుతుందన్నారు.రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 1750 కోట్లు లంచాలుగా అదానీ సమర్పించుకున్నట్టు అమెరికా నిఘా సంస్థలు బయటపెట్టిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అదానీ సంస్థలతో గత వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసకాండపై పార్లమెంటులో చర్చించాలని రాష్ట్రంలో శాంతి నెలకొనే విధంగా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఏడాదికి పైగా మణిపూర్ లో మారణాకాండ జరుగుతుంటే ప్రధాని మోడీ మణిపూర్ లో పర్యటించకపోవడం, శాంతి నెలకొల్పేందుకు చర్యలు చేపట్టక పోవడం అత్యంత బాధాకరమన్నారు.మణిపూర్ మారణకాండ అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు.అధికధరలు నియంత్రించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భీమారావు డిమాండ్ చేశారు.
సోలార్ విద్యుత్ కొనుగోలులో అదానీ అవినీతిపై (సిపిసి)చే విచారణ జరిపించాలి – సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు
10
Dec