రేషన్‌ బియ్యం ప్రజలు వండుకుని తినేలా మార్పు తీసుకురావాలి – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ న్యూస్ (విజయవాడ) అక్రమ రేషన్‌ బియ్యం వ్యవహారంలో సీజ్‌ చేసి ఆక్షన్‌ వేస్తున్న బియ్యం తిరిగి ఎవరు కొనుగోలు చేస్తున్నారు? మళ్లీ ఆ బియ్యం ఎక్కడకు వెళుతున్నాయి? కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు రీసైక్లింగ్‌ చేస్తున్నారా? అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. గురువారం శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 9664 మేర 6(ఎ) కేసులు నమోదు చేసి సీజ్‌ చేసిన సుమారు 76 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తున్నారు..? తిరిగి ఆబియ్యం ఎక్కడకు వెళుతున్నాయో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాదెండ్ల మనోహర్‌ ఇంచార్జ్ గా ఉన్న ఏలూరు జిల్లాలో ఎంత బియ్యం సీజ్‌ చేశారు.? కొనుగోలు చేసిన ట్రేడర్లు ఎవరని ప్రశ్నించారు. 2022–24 మధ్య కాలంలో అప్పట్లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన కారుమూరి వెంకటనాగేశ్వరరావు కనుసన్నల్లో కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోందని ఈ వ్యహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. నామమాత్రంగా 6(ఎ) కేసులు నమోదు చేయడం ప్రయోజనం లేదని తిరిగి అవే అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గత వైసీపీ అయిదేళ్ల కాలంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రేషన్‌ మాఫియా విస్తరించిందన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం వినియోగదారులకు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి అదే బియ్యాన్ని రూ. 18 చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ అక్రమ వ్యవస్థకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇలా గత అయిదేళ్ల కాలంలో రాష్ట్రాస్థాయిలో దోపిడీ చేశారని గుర్తు చేశారు. రేషన్‌ బియ్యం ప్రజలు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో సైతం దాదాపు 60 శాతం పైగా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. ఏ నెల ఉత్పత్తి అయిన బియ్యం ఆ నెలలోనే పంపిణీ చేయడం కాకుండా మూడు నాలుగు నెలలు నిల్వ చేసి పంపిణీ చేయడం ద్వారా పాతబియ్యంగా వండుకుని తినే అవకాశం ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నాదెండ్ల మనోహర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు తనిఖీలు చేసి అవకతవకలను వెలికి తీశారన్నారు. కాకినాడ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అడ్డుకుని దాదాపు 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేసిన మంత్రి మనోహర్‌ను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *