రాష్ట్రంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది…

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి*

*అనవసర రాద్దాంతం, అసభ్యకర భాష కారణంగా ప్రజలు మిమ్మల్ని 11కి పరిమితం చేశారు*

*అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది*

*లో ఓల్టేజ్ సమస్యను అరికట్టేందుకు కొత్తగా సబ్ స్టేషన్లు ఏర్పాటు*

*-ప.గో ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్*

లీడర్ న్యూస్ (తణుకు) రాష్ట్రంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గురువారం ప.గో జిల్లా తణుకులో ఇంచార్జ్ మంత్రి హోదాలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలో రూ. 23 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇరువురు మంత్రులు శంఖుస్థాపన చేశారు. స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, ప.గో జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజుతో కలిసి త‌ణుకు మున్సిపాలిటీ ప‌రిధిలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాల‌కు రిబ్బను కట్ చేసి ప్రారంభించారు. నాణ్యమైన విద్యుత్ కోసం వేల్పూరులో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్, బీసీ జనార్ధన్ రెడ్డిలు బటన్ నొక్కి ప్రారంభించారు.

ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్… వైసీపీ ప్ర‌భుత్వంలో వ్య‌వ‌స్థ‌ల్ని భ్ర‌ష్టు ప‌ట్టించి స‌ర్వ నాశ‌నం చేసిందని మండిపడ్డారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో టీడీఆర్ బాండ్లలో అవినీతికి పాల్పడి వైసీపీ నేత‌లు కోట్ల రూపాయిలు దండుకున్నారని ఆరోపించారు. మున్సిప‌ల్ వ్య‌వస్థని ప్ర‌క్షాళ‌న చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మంత్రి గొట్టిపాటి వివరించారు. త‌ణుకు ప‌రిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రెండు స‌బ్ స్టేష‌న్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం గుంతలు పడిన రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ. 861 కోట్లతో గుంతలు పూడ్చిందని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు.

*వైసీపీకి ఇంకా బుద్ధిరాలేదు…*

కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుంటే.. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలకు తెర తీస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చినా కానీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బట్టలిప్పుతామని ఒకరు అంటే, చంపుతామని మరోకరు బెదిరిస్తున్నారని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *