లీడర్ న్యూస్ (తణుకు) అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులతో కమీటీల నియామకం జరిపి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అందుకు తగిన నిధులు కేటాయించాలని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు డిమాండ్ చేసారు. ఆదివారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో జరిగిన అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా సమావేశానికి తిరుపతిరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు స్వాగతిస్తున్నామన్నారు. కాలయాపన లేకుండా కమిటీలు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు త్వరితగతిన చేపట్టాలని అవసరమైన నిధులు కేటాయించాలని పునరుద్ఘాటించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వివి నాయుడు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్థులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. చాలా ప్రాంతాల్లో అగ్రి ఆస్తులు కబ్జాలకు గురికావడం జరిగిందని తక్షణమే వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. గత పదేళ్ల పోరాట ఫలితంగా 906 కోట్ల రూపాయల డిపాజిట్ లు చెల్లించడం జరిగిందన్నారు. ఇంకా 3400 కోట్ల రూపాయలు బాధితులకు డిపాజిట్ ల సొమ్ము చెల్లించవలసి వుందన్నారు. బాధితులకు చెల్లించవలసిన సొమ్ము కన్నా అగ్రి ఆస్తులు విలువ నాలుగైదు రెట్లు అధికంగా వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం వుందన్నారు. ఇచ్చిన హామీలు అమలుకు పూనుకుని న్యాయం జరుపకపోతే మళ్ళీ ఉద్యమబాట పడతామన్నారు. సుమారు 22 లక్షల మంది అగ్రి బాధితులు వున్నారన్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిసి సుమారు కోటిమంది వుంటారని వీరందరినీ దృష్టిలో పెట్టుకుని సత్వర న్యాయం అందించాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి వై. నాగలక్ష్మి, ఎన్. రామశ్రీను, గోపాలకృష్ణ జిల్లా లోని వివిధ బ్రాంచిల అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడారు. అధికసంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి –
15
Jun