లీడర్ న్యూస్ (అమరావతి) అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అరాచకాలు సృష్టించారో… ఇప్పుడూ అలాంటి విధానాలనే గత పాలకులు కొనసాగిస్తున్నారు. గొంతులు కోస్తాం… తలలు నరికేస్తాం వంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు ఇక్కడ! పిచ్చిపిచ్చిగా మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం మాత్రం కాదని స్పష్టం చేశారు. శాంతిభత్రాలకు విఘాతం కలిగించేవారిని కచ్చితంగా కట్టడి చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో సోమవారం సాయంత్రం రాజధాని అమరావతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత పాలకులు అధికారంలో లేకపోయినా రౌడీయిజం, అసాంఘిక విధానాల్లో ఏ మాత్రం మార్పురావడం లేదు. వాళ్లకు ప్రజాస్వామ్య విధానాలపై అసలు గౌరవమే లేదు. అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగుతున్నారు. ఖండాలు దాటి వెళ్లినా పట్టుకొస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా బెదిరించే వాళ్లకు మేము ఒకటే చెబుతున్నాం. ఇలాంటి తాటాకు చప్పుళ్లుకు బెదిరిపోయే వాళ్లు కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు. మళ్లీ వైసీపీ వస్తే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన అవసరం లేదు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. కూటమి ఐక్యతను చెడగొట్టే పరిస్థితుల్లో ఎవరూ లేరు. మరో 20 ఏళ్ల వరకు వైసీపీ ప్రభుత్వం రాదు… రావట్లేదు. సజ్జనుడికి కోపం వస్తే అడవి దహనం అవుతుంది. మాది మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు. సమర్థవంతమైన ప్రభుత్వం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారిని తొక్కి నార తీస్తాం. మేం చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం.
• కూటమి ప్రభుత్వం రాకుంటే ఏపీ ఏమయ్యేదో..?
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చాలా కష్టాలు, ఒత్తిళ్లు మధ్య పాలన చేపట్టాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నుంచి ఆంధ్రప్రదేశ్ బాగుకోసం ఆలోచించాను. 2019లో ప్రభుత్వం మారిన వెంటనే విధ్వంస పాలన మొదలైంది. బూతులు తిట్టడం, భయపెట్టడం పరిపాటిగా మారింది. ప్రశ్నించే వారిని ఏదో ఒక నెపం పెట్టి జైల్లో పెట్టాలని చూశారు. ఏదైనా మాట్లాడదాం అంటే రౌడీమూకలు దాడులకు తెగపడేవారు. అధికార యంత్రాంగం భయం గుప్పెట్లో చిక్కుకుపోయింది. వీటన్నింటి మధ్య రాష్ట్రం విలవిలలాడిపోయింది. ఇలాంటివన్ని ప్రజాహితం కోరుకునే ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేసింది. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందిపడ్డారు. విశాఖపట్నంలో నన్ను బయటకు రానివ్వలేదు. యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి లోకేష్ ని ఇబ్బంది పెట్టారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వదల్లేదు. వైసీపీ పాలన చూశాక రాష్ట్రానికి అసలు వెలుగు వస్తుందా? అని అనుకున్నా. కూటమి ప్రభుత్వం రాకుంటే రాష్ట్రం ఏమయ్యేదో అనిపించింది. ప్రజలకు సుపరిపాలన అందించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.