ఓ మత్స్యకారుడిగా ఆలోచించి సమస్యను పరిష్కరిస్తా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

లీడర్ న్యూస్ (పిఠాపురం) నేను ఉప ముఖ్యమంత్రిగానో, ఎమ్మెల్యేగానో ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా, వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. పరిశ్రమల ద్వారా సముద్రంలో కలుస్తున్న కలుషిత జలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే కనీసం 100 రోజుల సమయం కావాలని, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే పరిష్కారాన్ని చూపించే బాధ్యతను తాను తీసుకుంటానని వెల్లడించారు. పిఠాపురం నియోజక వర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల కలుషిత జలాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలన్నారు. ఉప్పాడ మత్స్యకారులంతా దీనిపై చేతులు పైకి ఎత్తి అభిప్రాయం తెలియజేయాలని బహిరంగ సభలోనే రిఫెరండం కోరారు. పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి గ్రామంతోపాటు చుట్టు పక్కలనున్న గ్రామాల్లో కొన్ని ఫార్మా పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద దెబ్బ తింటోందని, వేట కష్టం అవుతోందని గత కొద్దిరోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనల దృష్ట్యా సమస్యను పరిష్కరించేందుకు, మత్స్యకారుల వేదన వినేందుకు  పవన్ కళ్యాణ్  మత్స్యకారులతో మాటామంతీ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. అనంతరం ఉప్పాడ సెంటర్లో బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సభలో  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘పరిశ్రమలను మత్స్యకారులెవరూ వద్దు అనడం లేదు. పరిశ్రమల వల్ల వస్తున్న కాలుష్యాన్ని మాత్రమే వారు వ్యతిరేకిస్తున్నారు. ఇది మత్స్యకారులకు అభివృద్ధి మీద ఉన్న అవగాహనకు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి కీలకం. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీన్ని మనసుతో అర్ధం చేసుకున్న మత్స్యకారులకు కృతజ్ఞతలు. అయితే మత్స్యసంపదను, వారి జీవనభృతిని దెబ్బతీస్తున్న కాలుష్యాన్ని అరికట్టడంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలి. తీర ప్రాంతంతో పాటు పిఠాపురం చుట్టు పక్కల ప్రాంతాల్లోకి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం మీద కూడా ఆడిట్ చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నాం. దీనిపై ఓ ప్రత్యేకమైన కమిటీ వేసి సమస్యను గుర్తించడమే కాదు.. దాని పరిష్కారాన్ని చూపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. సముద్రంలోకి వెళ్లి కాలుష్యాన్ని పరిశీలిస్తా..మత్స్యకారుల సమస్యపై ఏదో ఒకటి చెప్పి, చప్పట్లు కొట్టించుకొని వెళ్లిపోవడానికి నేను రాలేదు. మీలో ఒకడిగా సమస్యను వింటాను. అర్ధం చేసుకుంటాను. నా సోదర మత్స్యకారులు తమ బాధలో ఏదైనా మాట అంటే పడతాను. ప్రస్తుత కాలుష్య సమస్య ఇప్పటిది కాదు. 2005 ప్రాంతంలోనే నక్కపల్లి సెజ్ కు, ఇక్కడి పరిశ్రమల స్థాపనకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారు. గతంలో పెట్టిన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, అసలు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని చూసేందుకు నేరుగా ఓ పడవలో సముద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మరో రెండు, మూడు రోజుల్లో ఇక్కడకు వచ్చి సముద్రంలోకి వెళ్లి కాలుష్య సమస్యను తెలుసుకుంటాను. మత్స్యకారులు మనసున్న వారు. ఎవరికీ అపకారం చేయాలని, పొట్ట కొట్టాలని అనుకోరు. వేటకు వెళ్లేవారికి కాస్త కోపం సహజం. ఆ కోపంలో నన్ను ఏమైనా అన్నా, పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను.అయితే పారిశ్రామిక వేత్తలను కొందరు రాజకీయ నాయకులు మత్స్యకారులను అడ్డు పెట్టుకొని బెదిరించినా, భయపెట్టినా సహించేది లేదు. మత్స్యకారులు కూడా అలాంటి వారి వలలో పడొద్దని కోరుతున్నాను. పరిశ్రమల కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి పరిహారం అందాలి..? దానికున్న మార్గాలను కూడా విపులంగా చర్చిస్తామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *