లీడర్ న్యూస్ (కొత్త పేట)మొంథా తుఫాన్ ముందస్తు చర్యలతో పాటు, తుఫాన్ సమయంలో సహాయక చర్యల్లో ముందుండి సేవలందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాన్ని అందించి సత్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన అభినందన కార్యక్రమంలో తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాలు అందజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పునరావాస ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు. రావులపాడు, వానపల్లి తదితర పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రతీ బాధితుడికి అండగా నిలిచారు. తుఫాను ప్రభావం తగ్గిన వెనువెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పంట నష్టపోయిన అన్నదాతలను కలిసి భరోసా అందించారు. ఎమ్మెల్యే సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి శనివారం పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ అనునిత్యం ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసే తన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పురస్కారం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తమ సేవలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు….*మొంథా తుఫాన్ సమయంలో ఎమ్మెల్యే బండారు సేవలకు గుర్తింపు…
02
Nov