వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట…

లీడర్ న్యూస్ (పశ్చిమ గోదావరి జిల్లా) తణుకు మండలం వేల్పూరు గ్రామంలో 45 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాముడికి ప్రియమైన భక్తుడిగా అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజవర్గంలో జరగాలని ఆయన ఆకాంక్షించారు. అభయాంజనేయ స్వామి వారి విగ్రహంతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ వేల్పూరు గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *