స్వచ్చాంధ్ర కోసం ఉద్యమం చేద్దాం…జిల్లాలో రోడ్లు అభివృద్ధికి తక్షణ చర్యలు – సీఎం చంద్రబాబు నాయుడు

*తణుకు మున్సిపాల్టీలకు రూ. 50 కోట్లు మంజూరు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*ఎమ్మెల్యే రాధాకృష్ణ డైనమిక్ ఎమ్మెల్యే అంటూ కితాబు..

*పారిశుద్ధ్య కార్మికులను పక్కన కూర్చోబెట్టుకున్న సీఎం..

*పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశం…

*జిల్లాలకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు…

లీడర్ న్యూస్ (తణుకు) స్వచ్చాంధ్ర కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమం చేద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ హితం కోసం రాబోయే 2047 విజన్‌ లక్ష్యంతో ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. తణుకులో శనివారం నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్చ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. మన నివాసాలతోపాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గత పాలకులు అయిదేళ్ల కాలంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని కనీసం తీయలేదని చెప్పారు. 8 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను వారసత్వంగా మనకు అందజేశారని ఎద్దేవా చేశారు. మన ఆరోగ్యం కాపాడే మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులంటే తనకు గౌరవం ఉందని అందుకే తనపక్కనే కూర్చోబెట్టుకున్నాని గతంలో వీరంటే చులకన భావం ఉండేదని అయితే ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులే మన ఆరోగ్యాలను కాపాడుతున్నారని కొనియాడారు. ప్రకృతిని నాశనం చేసుకున్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మున్సిపల్‌ శాఖలో వివిధ పనుల నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రూ. 150 కోట్లు నిధులు అందజేస్తున్నారని చెప్పారు.

జిల్లాలకు ర్యాంకులు…

స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి విభాగానికి పనితీరు ఆధారంగా ఇండికేటర్‌ ర్యాంకింగ్స్‌ తయారు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మున్సిపల్‌ శాఖకు 20 పాయింట్లు , పంచాయతీరాజ్‌కు 28, ఎడ్యుకేషన్‌కు 14, టూరిజంకు 11, ఇండస్ట్రీస్‌కు 13, హాస్టల్స్‌కు 11, ఎండోమెంట్‌కు 11, ఆస్పత్రులకు 9, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌కు 5, బస్టాండ్లు, ర్వైల్వే స్టేషన్లకు 7, మార్కెట్స్‌కు 9, హైవేస్‌కు 3, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు 7 పాయింట్లు చొప్పున కేటాయించినట్లు చెప్పారు. మున్సిపల్‌ అడ్మినిష్ట్రేషన్‌లో జిల్లాల పనితీరులో ఎన్టీఆర్‌ జిల్లా 134 పాయింట్లు, అనాకపల్లి జిల్లా 131, తిరుపతి 128, విశాఖ 127, అనంతపురం 123, కాకినాడ 121, గుంటూరు 119, తూర్పు గోదావరి 118, పల్నాడు 117, అన్నమయ్య 115, అంబేద్కర్‌ కోనసీమ 115, శ్రీకాకుళం 113, వైఎస్సాఆర్‌ 113, బాపట్ల 111, ఏలూరు జిల్లా 108, కర్నూలు 104, నంద్యాల 102, సత్యసాయి 102, పార్వతీపురం 100, పొట్టి శ్రీరాములు 100, విజయనగరం 100, కృష్ణా 99, ప్రకాశం 99, పశ్చిమ గోదావరి 97, చిత్తూరు 91, అల్లూరు సీతారామరాజు 68 పాయింట్లు చొప్పున వచ్చాయని చెప్పారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అందరి పనితనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

*తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ… డైనమిక్‌ ఎమ్మెల్యే…

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ… డైనమిక్‌ ఎమ్మెల్యే… ఎప్పుడూ అభివృద్ధి కోసం నిధులు అంటూ వెంటపడుతూ ఉంటారు… పోనీ పది ఇరవై కాదు… ఏకంగా రూ. వందల కోట్లు అడుగుతూ ఉంటారు… అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పనితీరుపై కితాబు ఇచ్చారు. ఏ పని చేపట్టినా వినూత్నంగా చేస్తూ ఉంటారని ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. తణుకు నుంచి భీమవరం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు అభివృద్ధితోపాటు మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారని తక్షణమే సంబంధిత అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారని హమీ ఇచ్చారు. తణుకు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం తక్షణ సాయం కింద రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *