లీడర్ న్యూస్ (నిడదవోలు) నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా, అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు శక్తియుక్తులు ప్రసాదించాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం పెరవలి మండలం ముత్యాలవారి పాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
“నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నిడదవోలు ప్రజల గొప్పతనంతో నేడు మంత్రిగా మీ ముందు ఉన్నాను. పరిపాలనా దక్షుడైన సీఎం చంద్రబాబు నాయుడు టీంలో సభ్యుడిగా ఉంటూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో పనిచేయడం గర్వంగా ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తాను” అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో నిడదవోలు రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు.ఈనెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు. ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’తో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని, ఈ పర్యటనను ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.
అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో వర్ధిల్లాలని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.