లీడర్ న్యూస్ (తణుకు) అబద్దం, వంచన, మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, వారి భవిష్యత్తును ముళ్లబాటగా మారుస్తుందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా పేదవిద్యార్థుల విద్యను అంధకారంలోకి నెడుతుందని దుయ్యబట్టారు. మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించేలా చేశారని, అప్పటి చదువులతో పేదలు లక్షాధికారులుగా మారారని అన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత చదివితే అంతా ఉచితం చేసి వారి గుండెల్లో గూడుకట్టుకున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతోపాటు నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కానీ నేడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని బాకాలు ఊదుకునే చంద్రబాబు వీటన్నిటినీ తుంగలో తొక్కి పేదలకు విద్యను అందకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పైగా ఖజానాలో డబ్బులేదని ఇవ్వాల్సిన సంక్షేమం చూస్తుంటే భయమేస్తుందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నీకు రూ.15వేలు అన్న మంత్రి నిమ్మల రామానాయుడు విద్యార్థులు, తల్లితండ్రులకు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని, ఇకపై మీమాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలు తీసుకువచ్చి వాటి నిర్మాణాలు చేపట్టారని, తీరా మంజూరైన 750 మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు రాసివ్వడమే కాకుండా వైద్య కళాశాలలను ప్రైవేటుపరంగా చేసేందుకు కుట్ర చేస్తూ వైద్యవిద్యను పేదలకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈనెల 12న వైఎస్సార్‌సీపీ యువతపోరు..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 12న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిర్వహించ తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు విజయవంతం చేయాలని కోరారు. తణుకు నుంచి భీమవరం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు.