లీడర్ న్యూస్ ప్రతినిధి (విశాఖపట్నం) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో, సమష్టి కృషితో పనిచేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్య నాయకులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోన్ కోఆర్డినేటర్, తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరాన్ని మంత్రి నారా లోకేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎంతో కీలకమని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోన్ కోఆర్డినేటర్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో విజయనగరం జిల్లాకు చెందిన కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, స్థానికంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.ఈ కార్యక్రమలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి… *ముఖ్య నాయకుల సమీక్షా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పిలుపు… *విజయనగరం జిల్లా సమీక్ష సమావేశంలో లోకేష్ తో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ….
23
Aug