లీడర్ న్యూస్ ప్రతినిధి (తణుకు)మద్యం అక్రమ రవాణా కేసులో అవినీతిలో నిలువారా కూరుకుపోయిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు వ్యవహారంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. మధ్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మంత్రిగా పనిచేసిన కారుమూరి సైతం వివిధ కంపెనీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని సాక్షాత్తు ఈడి దర్యాప్తులో వెలడైందని చెప్పారు. లిక్కర్ కుంభకోణంలో రూ. 3500 కోట్లు మేర భారీ కుంభకోణం వెలుగు చూసిందని చెప్పారు. ఈడి, సిట్ దర్యాప్తు సంస్థల ద్వారా బయటకు అక్రమాలు వెలుగుచూస్తున్నాయని చెప్పారు. కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.195 కోట్లు లావాదేవీలు జరిగాయని ఈడీ సంస్థ గుర్తించిందని చెప్పారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం కారుమూరి దాఖలు చేసిన బెయిల్ తిరస్కరించింది అంటే అవినీతి ఏమైనా జరిగిందో అర్థం అవుతుందని చెప్పారు దీన్ని వైసిపి నాయకులు ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారంటూ డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి దాని ద్వారా సానుభూతి పొందాలంటే రాష్ట్ర ప్రజలు, తణుకు నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాజకీయ కక్షలని చెబుతున్న వైసిపి నాయకులు ప్రభుత్వమే వారి పేరున ఖాతాలు తెరిచి ప్రభుత్వమే వారి ఖాతాల్లో నగదు నువ్వు బదిలీ చేశారా అని ప్రశ్నించారు. సెల్ కంపెనీలు పేరుతో ఎలా దోపిడీ చేశారో కళ్ళకు కట్టినట్లుగా దర్యాప్తు సంస్థలు ఆరు నెలలుగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి గాని తెలుగుదేశం పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో చేసిన తప్పిదాలు అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని చెప్పారు. గత వైసిపి హయాంలో ఎంతోమంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రులను అక్రమ అరెస్టులు చేసిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. కక్షపూరితంగా అరెస్టులు చేయించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. జైలు యాత్రలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కారుమూరిని జైలులో పరామర్శిస్తారా లేదా అనేది వేచి చూడాలని అన్నారు. కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ ఇదే కేసులో రెండు నెలలుగా జైలులో ఉంటే ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఐదేళ్లుగా కేటాక్స్ పేరుతో ఎన్నో అక్రమాలు దోపిడీలు చేసిన కారుమూరి ఇప్పుడు పర్యవసానం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. సిగ్గు లేకుండా మళ్లీ రోడ్లపైకి వస్తే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. ఈడి సంస్థలతోపాటు అత్యున్నత న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తప్ప ఇందులో కక్షపూరిత చర్యలు ఏమీ లేవని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కారుమూరి అరెస్టు వ్యవహారంలో రాజకీయ కక్షలు లేవు – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
25
Aug