పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (తణుకు) ఆర్నాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్థానిక కూటమి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో తణుకు ఇరగవరం అత్తిలి మండలంలో సుమారు 45 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తే 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు.నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను, నష్టపోయిన రైతులను స్వయంగా పరామర్శించినట్లు చెప్పారు.పంట నష్ట పోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్నబ్‌ తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ,ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. తుఫాను సమయంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలను సైతం విమర్శిస్తూ వైకాపా నాయకులు హేళన చేయడం వారి రాజకీయ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తుఫాను దాటికి విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం

తుఫాను ప్రభావంతో తణుకు పట్టణం, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని 48 గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సుమారు 200 విద్యుత్‌ స్తంభాలు, 14 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ఇప్పటికే 90 నుంచి 95 శాతం వరకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారని చెప్పారు. తణుకు రూరల్‌ మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పూర్తయిందని, అత్తిలి మండలంలో మిగిలిన గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరగవరం మండలంలో చెట్లు కూలిపోవడంతో విద్యుత్‌ వ్యవస్థకు అధిక నష్టం వాటిల్లిందని, అక్కడ కూడా పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు అవసరమైన సామగ్రిని ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లి సమకూర్చుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *