మా నాయకుడు అందుబాటులో లేకపోయినా క్యాడర్ కసితో పనిచేసింది – వెలగల సాయిబాబా రెడ్డి

లీడర్ న్యూస్ (తణుకు) మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినా ఆయన ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీల విజయమే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌ అంతా నిలబడిందని వెఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి అన్నారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కారుమూరిని ఇబ్బందులు పెట్టిన దృష్ట్యా ఎంపీటీసీ నామినేషన్లలో పార్టీ క్యాడర్‌ కసిగా నిలబడి పనిచేశారని అన్నారు. కూటమి నాయకులు మాత్రం అభ్యర్థులను బెదిరించి భయపెట్టే ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారి బంధువులకు సైతం ఫోన్‌లు చేసి బెదిరించారని, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారిని కూడా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మా నాయకుడు కారుమూరి అందుబాటులో లేని పరిస్థితుల్లో మీరు నిజాయితీగా ఎన్నికల బరిలో నిలబడి నామినేషన్లు వేసుకుని, ప్రచారం చేసుకుని గెలవాలి కానీ అడ్డదారిలో బెదిరింపులకు దిగాల్సిన పనేంటని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల ఎజెండాగా అభ్యర్థులంతా కూటమి ప్రభుత్వ వైఫల్యాలైన నిత్యావసర సరుకుల ధరలు పెంపు, ఇస్తానన్న సంక్షేమం ఇవ్వకపోవడం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లనున్నామని స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

పోలీసులు తీరు మార్చుకోవాలి…

అధికారపార్టీకి అనుకూలంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసులు, బైండోవర్‌లకు నియోజకవర్గంలోని పోలీసు అధికారులు దిగుతున్నారని అన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని బైండోవర్‌ చేయడం దుర్మార్గమని, ఏడాది క్రితం ఒక గొడవలో పెద్దమనిషిగా వెళ్లినందుకు నేడు ఆయనను బైండోవర్‌ చేయడం సిగ్గుచేటన్నారు. తణుకు నియోజకవర్గంలో పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని, నేడు కూటమి నాయకుల మాటలు విని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసులు అక్రమంగా కేసులు కడితే భవిష్యత్తులో ఆ అధికారి ఎక్కడున్నా ఆయనను ఇక్కడకు తీసుకువచ్చి వారితోనే ఆ కేసును తీయిస్తామని హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *